|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:34 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన డుంబ్రిగూడ మండలం గుంటసీమలో చోటుచేసుకుంది. గుంటసీమలోని జంగమయ్య ఆలయానికి ఎదురుగా ఓ చెరువు ఉంది. వేసవి కాలం కావటంతో సరదాగా ఈతకొడదామని ముగ్గురు బాలురు చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. గుంటసీమకు చెందిన సుశాంత్‌తో పాటుగా.. కోతంగి పంచాయతీ బిల్లాపూట్ గ్రామానికి చెందిన భానుతేజ, సాయికిరణ్ ఈత కోసం చెరువు వద్దకు వెళ్లారు. చెరువులోకి దిగి ఈత కొట్టే క్రమంలో గల్లంతయ్యారు. అయితే చిన్నారులు గల్లంతైన విషయం తెలుసుకున్న స్థానికులు.. చెరువులో గాలించగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మరోవైపు సుశాంత్‌ది అదే ఊరు కాగా.. భానుతేజ, సాయికిరణ్ వేరే ఊరికి చెందిన వారు. వారం రోజుల క్రితమే మేనమామ ఇంటికి వచ్చారు. ఈలోపు ఇలా స్నేహితుడితో ఈతకు వెళ్లి.. విగతజీవులుగా మారారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు సరదాగా ఈత కోసం వెళ్లిన చిన్నారులు ఇలా శవమై కనిపించే సరికి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ దృశ్యం స్థానికులకు కూడా కన్నీళ్లు తెప్పించింది. ముగ్గురు చిన్నారులు ఇలా చనిపోవటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Latest News