|
|
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:34 PM
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో వైసీపీలో కొనసాగిన ఆయన.. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒకే రోజు రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఆపనుల పనితీరును స్కూటర్ మీద తిరుగుతూ పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తి చేయించారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. వైసీపీ శ్రేణులు ఈ ఫోటోను చాలా రోజుల నుంచి వైరల్ చేస్తున్నాయి.
తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ఢి ఫోటోను, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా కలిపి వైరల్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వచ్చిన భారీ పరిశ్రమలు.. ఒకటి నెల్లూరులో నైటీలు షాప్.. రెండు విజయవాడలో కటింగ్ షాప్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తనపై వస్తున్న ట్రోల్స్‌కు దీటుగా బదులిచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తూ ట్వీట్ చేశారు.
ఒక నిరుపేద సోదరి, తన రెక్కల కష్టంతో జీవనోపాధి కోసం నెలకొల్పిన ఒక చిన్న వస్త్రాల దుకాణం ప్రారంభోత్సవానికి, స్థానిక కమ్యూనిస్టు నాయకుల ఆహ్వానంపై తాను వెళ్లినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన ఆశయాన్ని నిలబెట్టేందుకు ఒక ప్రజాప్రతినిధిగా హాజరైన సందర్భాన్ని అపహాస్యం చేయడం, వారి అవగాహన స్థాయి ప్రతిబింబంగా భావిస్తున్నానంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18 గ్రామాల్లో చంద్రన్న పల్లెపండుగ కార్యక్రమం ముగిసింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. 18 గ్రామాలలో.. 11 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేసి.. ప్రజలకు అంకితం చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేసి, నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
మరోవైపు కృష్ణా జిల్లా పెనమలూరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం పర్యటించారు. కానూరులో పవన్ కళ్యాణ్ సెలూన్ షాపు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్‌ను చూడడానికి అభిమానులు భారీగా అక్కడకు తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. పవన్ కల్యాణ్ టీషర్టు, షార్టులో స్టైలిష్‌గా కనిపించడం విశేషం.
Latest News