|
|
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:17 PM
ఇటీవల పాకిస్థాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ లోని కొన్ని నగరాల్లో డ్రోన్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ముంబైలో కూడా డ్రోన్లపై ఆంక్షలు ఉన్నాయి. నగరంలో డ్రోన్లు (మానవరహిత వైమానిక వాహనాలు - యూఏవీలు) ఎగరవేయడంపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, కందివలి ప్రాంతంలోని బందర్ పఖాడీలో శనివారం అర్ధరాత్రి ఓ డ్రోన్ సంచరించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారని ఓ అధికారి ఆదివారం తెలిపారు.కందివలి పశ్చిమ ప్రాంతంలోని చార్‌కోప్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. శనివారం అర్ధరాత్రి తమ ప్రాంతంలో డ్రోన్ ఎగురుతోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే వారు రంగంలోకి దిగారు. "కొన్ని ఎత్తైన భవనాల్లోని అపార్ట్‌మెంట్ల పై అంతస్తుల్లో నివసించే వారి కిటికీల సమీపంలోకి డ్రోన్ రావడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు" అని సదరు అధికారి వివరించారు. కొన్ని నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టి మాయమైన ఈ డ్రోన్‌ను నడిపిన ఆపరేటర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Latest News