![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:59 PM
మరణం తర్వాత జీవితం ఉంటుందా? ఈ ప్రశ్న శతాబ్దాలుగా మానవాళిని వేధిస్తూనే ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అయితే, స్పెయిన్‌కు చెందిన ఓ మహిళకు ఎదురైన ఓ విస్మయకరమైన అనుభవం ఇప్పుడు ఈ చర్చను మళ్లీ తీవ్రతరం చేసింది. వైద్యపరంగా 24 నిమిషాల పాటు మరణించిన ఆమె.. ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.స్పెయిన్‌లోని అండలూసియా ప్రాంతానికి చెందిన టెస్సా రోమెరో (50) వృత్తిరీత్యా సామాజిక శాస్త్రవేత్త, జర్నలిస్ట్. ఒక పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. ఓ రోజు ఉదయం తన కుమార్తెలను పాఠశాలలో దిగబెట్టి వచ్చిన తర్వాత టెస్సా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. శ్వాస ఆడకపోవడంతో పాటు, గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోయింది. వైద్యులు దాదాపు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి చివరకు ఆమెను బతికించారు. అయితే, ఈ 24 నిమిషాల వ్యవధిలో టెస్సా పొందిన అనుభవం ఆమె జీవితాన్నే మార్చేసింది.వైద్యపరంగా మరణించిన ఆ 24 నిమిషాల్లో తాను ఓ అద్భుతమైన, ప్రశాంతమైన అనుభూతిని పొందానని టెస్సా తెలిపారు. "నొప్పి, విచారం, కాలం కూడా లేని ఓ ప్రపంచంలోకి ప్రవేశించాను. నా భుజాలపై నుంచి ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించింది" అని ఆమె ఆ అనుభవాన్ని వర్ణించారు. తాను ఒక భవనం పైనుంచి తేలుతూ, కింద ఉన్న తన నిర్జీవ శరీరాన్ని చూసుకున్నానని కూడా ఆమె చెప్పారు. "నేను చనిపోయానని నాకు తెలియదు. చుట్టూ ఉన్నవారికి నేను కనిపించకపోయినా, నేను సజీవంగా ఉన్నట్లు భావించాను" అని ఆమె తన పుస్తకంలో రాసుకున్నారు. ఈ అనుభవం కల కాదని, భ్రమ అంతకంటే కాదని, అది తనకంటే గొప్పదైన దానితో స్పృహతో కూడిన, స్పష్టమైన అనుసంధానమని టెస్సా నొక్కి చెప్పారు. ఒకప్పుడు ఇలాంటి కథలను కల్పనలుగా కొట్టిపారేసిన ఆమె, ఇప్పుడు వాటిని నమ్ముతున్నారు. "ఈ ప్రపంచం కంటే ఆ ప్రపంచమే నాకు మరింత వాస్తవంగా అనిపించింది. అక్కడ సమయం నెమ్మదిగా సాగింది, భావాలు మరింత లోతుగా ఉన్నాయి, ప్రతిదీ అర్థవంతంగా తోచింది" అని ఆమె తెలిపారు.
Latest News