![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:01 PM
భారత టెస్ట్ క్రికెట్ జట్టులో కొత్త శకం ప్రారంభమైంది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారిద్దరికీ ఇది తొలి ఇంగ్లాండ్ పర్యటన కానుంది. గురువారం రాత్రి భారత జట్టు ఈ కీలక పర్యటనకు బయలుదేరింది. అయితే, టెస్ట్ క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలే తమ రిటైర్మెంట్ ప్రకటించడంతో, వారిద్దరూ లేకుండానే టీమిండియా ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్, కోచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.పర్యటనకు బయలుదేరే ముందు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో, కెప్టెన్‌గా తొలి పర్యటన కావడం, అదీ రోహిత్, విరాట్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకుండా ఆడాల్సి రావడం వల్ల అదనపు ఒత్తిడి ఏమైనా ఉందా అని శుభ్‌మన్ గిల్‌ను ప్రశ్నించగా, ఎంతో ధీమాగా సమాధానమిచ్చాడు. "ప్రతి మ్యాచ్ లేదా టూర్ ప్రారంభంలో ఒత్తిడి సహజంగానే ఉంటుంది. ప్రతి సిరీస్‌కు ముందు ఒత్తిడి ఉంటుంది, కానీ దీనివల్ల అదనపు ఒత్తిడి ఏమీ ఉండదు. రోహిత్, విరాట్ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, వారి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం, కానీ జట్టుగా మాకు చాలా అనుభవం ఉంది, మేం చాలా మ్యాచ్‌లు ఆడాం" అని గిల్ అన్నాడు. "ఆటగాళ్లు, జట్టు అంతా ఒత్తిడికి అలవాటు పడ్డారు. మేమేమీ అంత అనుభవం లేని ఆటగాళ్లం కాదు. మా జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ కాంబినేషన్ చాలా బాగుంది" అని భారత టెస్ట్ కెప్టెన్ స్పష్టం చేశాడు.
Latest News