|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:44 AM
ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని, 'ఆపరేషన్ సిందూర్' చేపట్టడానికి గల కారణాలను అంతర్జాతీయ సమాజానికి వివరించినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గురువారం దిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారత ప్రతినిధి బృందం ఇటీవల నాలుగు దేశాల్లో పర్యటించిందని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా తాము ఖతార్, దక్షిణాఫ్రికా, ఇథియోపియా, ఈజిప్ట్ దేశాల్లో పర్యటించామని, ఆయా దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపామని వివరించారు. "ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి దారితీసిన పరిస్థితులు, దాని లక్ష్యాలను ఈ పర్యటనలో వివరించాం. ఏప్రిల్ 22న జరిగిన ఓ ఘటనలో 26 మంది మరణించిన తర్వాత, దాదాపు 15 రోజులకు పైగా పాకిస్థాన్ ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకుంటుందని భారత్ వేచి చూసింది. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే భారత్ ఈ ఆపరేషన్ ప్రారంభించాల్సి వచ్చింది" అని ఎంపీ లావు తెలిపారు. కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించామని, సైనిక స్థావరాలపై గానీ, సాధారణ పౌరులపై గానీ దాడులు చేయలేదని స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ నాలుగు దేశాల పర్యటనలో మాజీ ప్రధానులు, ప్రస్తుత ఉప ప్రధానులు, పార్లమెంట్ స్పీకర్‌లు, ప్రతిపక్ష నాయకులు, మేధావులు, స్థానిక మీడియా ప్రతినిధులు, ప్రవాస భారతీయులు, భారతీయ వ్యాపారవేత్తలతో సహా అనేకమందిని కలిసినట్లు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. "ప్రతిచోటా భారత్ వాదనకు మంచి స్పందన లభించింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్ని దేశాలూ అంగీకరించాయి. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాకిస్థాన్‌లో ఉంటున్నాయనేది వాస్తవం" అని ఆయన అన్నారు.
Latest News