|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:55 AM
ఏడాది పాలనతోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైయస్ఆర్‌సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఛీకొట్టారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.... మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల నాయకులు ఏడాది కాలంగా ప్రజలను వంచిస్తున్నారు. అందుకే చంద్రబాబు పాలన మోసాలను నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. అంతకుముందే అధికారమదంతో కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. వేలాది బస్సులేసి తరలించినా జనం లేక సభ ఖాళీ కుర్చీలతో బోసిపోయి కనిపించింది. ప్రభుత్వ వ్యతిరేకతను చాటడానికి నిర్వహించిన వెన్నుపోటు దినం కి వచ్చిన స్పందన మహానాడుకి రాలేదు. ఇప్పటికైనా సిగ్గుపడి చంద్రబాబు కళ్లు తెరవాలి. ప్రజల సొమ్ముతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మా నాయకులు వైయస్ జగన్‌ని తిట్టడం, పార్టీ ఆఫీసులో ఆనం వెంకట రమణారెడ్డి వంటి వారితో తిట్టించడం తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ప్రయత్నం చేయడం లేదు. దివంగత మహానేత వైయస్సార్ ప్రోత్సాహంతో ఎదిగి, మా పార్టీలో పదవులు పొంది టీడీపీలో చేరిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి తిట్టించడం చూస్తే చంద్రబాబు నైజం అర్థమైపోతుంది. చంద్రబాబు కనీస రాజకీయ విలువలు పాటించడం లేదు. ఇంతకన్నా దిగజారడు అనుకున్న ప్రతిసారీ చంద్రబాబు దిగజారిపోతూనే ఉన్నాడు అని మండిపడ్డారు.
Latest News