|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:46 AM
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, ఏడుగుర్రాలపాడు గ్రామంలో ఒక దళిత బాలికపై నెలల తరబడి 14 మంది యువకులు అత్యాచారం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు సాకె శైలజానాథ్ మండిపడ్డారు. అత్యాచార బాధిత బాలిక కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫిర్యాదు చేయలేదని నిందితులను పోలీసులు వదిలేయడం బాధాకరమన్నారు. వైయస్ఆర్‌సీపీ తరఫున రేపే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. అయన మీడియాతో మాట్లాడుతూ.... మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహించే సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, ఏడుగుర్రాలపాడు గ్రామంలో ఒక దళిత బాలికపై నెలల తరబడి 14 మంది యువకులు అత్యాచారం చేసి ఫొటోలు వీడియోలు తీయడం, వాటిని చూపించి బెదిరించి అత్యాచారాలకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో బాధిత కుటుంబాన్ని భయపెట్టి ఊరి నుంచి తరిమేశారు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలో ప్రభుత్వం తక్షణం స్పందించాలి. బాలిక తరఫున ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పడం వారి ఉదాసీన వైఖరికి నిదర్శనం. బాలిక తండ్రి చనిపోయాడు. తల్లి మానసిక వికలాంగురాలు. బాలిక భయంతో వణికిపోతోంది. ఇలాంటి దుర్భర స్థితిలో కుటుంబం ఉందని తెలిసి కూడా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామనడం సిగ్గుచేటు. ఒక బాలికకు జరిగిన దారుణం వెలుగుచూస్తే పోలీసులు మానవత్వంతో స్పందించి చర్యలు తీసుకోవాల్సింది పోయి, మీనవేషాలు లెక్కించడం దారుణం. నిందితుల వివరాలు ప్రచారంలో ఉన్నా విచారించడానికి పోలీసులు ఎందుకు వెనకడుగు వేస్తున్నట్టు? ఈ కేసును విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలు కావాలా? దళిత కుటుంబం కదా వారి పక్షాన ఎవరుంటారులే అని ఉదాసీనంగా వ్యవహరిస్తే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. కంప్లైట్ చేయడమే కావాలనుకుంటే నేడు వైయస్సార్సీపీ తరఫున పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు.
Latest News