|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 09:06 PM
తెలుగు రాష్ట్రాలను ఆన్‌లైన్ బెట్టింగ్, డ్రగ్స్, గంజాయి భూతాలు భయపెడుతున్నాయి. యువత వీటి బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనాలు ఎక్కువగా కనిపించడం లేదు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొంతమంది యువత.. ఆన్‌లైన్ బెట్టింగ్ బారిన పడుతుండగా.. మత్తు అందించే నిషా కోసం మరికొంతమంది యువత.. గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని అలవాటు చేసుకుంటూ తమ బంగరు భవితను పాడుచేసుకుంటున్నారు. డ్రగ్స్, గంజాయి కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా.. మత్తుకు అలవాటు పడిన యువత మత్తు కోసం కొత్త దారులను వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే తిరుపతిలో మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం వెలుగుచూసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడి పాదాల చెంత ఉన్న తిరుపతిలో.. మత్తు ఇంజెక్షన్లు కలకలం రేపాయి. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో కొంతమంది యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మత్తు ఇంజెక్షన్లు తీసుకునే సమయంలో ఎవరో చాటుగా వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. మరోవైపు తిరుపతిలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గంజాయి, మత్తు ఇంజెక్షన్ల బారిన పడి యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని.. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు పెయిన్ కిల్లర్లు సహా ఇత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో వాడటం వల్ల ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. మత్తు ఇంజెక్షన్లు అధిక మోతాదులో తీసుకోవటం వలన శ్వాసకోశ వైఫల్యం, కోమా ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చని చెప్తున్నారు. మత్తు ఇంజెక్షన్లకు ఒక్కసారి బానిస అయితే, దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమని చెప్తున్నారు.
మత్తు ఇంజెక్షన్ల వాడకం వలన రక్తనాళాలు దెబ్బతినడంతో పాటుగా చర్మ సమస్యలు తలెత్తుతాయని, గుండె సమస్యలు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయంటున్నారు. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని.. ఈ వ్యసనం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయని,, సమాజంలో గౌరవం కోల్పోవడం, ఒంటరితనం వంటివి ఎదురవుతాయని చెప్తున్నారు. అందుకే మత్తు భూతానికి దూరంగా ఉండాలని సూచిస్తు్న్నారు.
Latest News