|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:16 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య 'ఎక్స్' వార్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. అది కాస్తా చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమిర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మస్క్.. తానే లేకపోతే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారని చెప్పారు. అక్కడితో ఆగకుండా తాజాగా అమెరికాలోని అతిపెద్ద కుంభకోణమైన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
అమెరికా రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఎక్స్ వేదికగా ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టారు. అందులో అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నం అయిందంటూ రాసుకొచ్చారు. అమెరికాలోనే అతిపెద్ద కుంభకోణం అయిన సెక్స్ కుంభకోణం నిందితుడు అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని వివరించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడి అయిన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయట పెట్టలేదని వ్యాఖ్యానించారు.
కానీ భవిష్యత్తులో ఇందుకు సంబంధించిన పూర్తి నిజానిజాలు వెలుగులోకి వస్తాయని.. ప్రపంచం మొత్తానికి దీని గురించి తెలుస్తుందని మస్క్ తెలిపారు. ఈ సందర్భంగానే ట్రంప్‌ను అభిశంసించాలంటూ ఒక నెటిజన్ పెట్టిన పోస్టును మస్క్ సమర్థించారు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్టులో ఉండగా.. మస్క్ దీన్ని రీపోస్ట్ చేశారు. అలాగే ఇందుకు తన పూర్తి మద్దతును తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ట్రంప్, ఎప్‌స్టీన్‌లకు సంబంధించ కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా మస్క్ షేర్ చేశారు.
అసలెవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్?
అమెరికాలోని అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడు అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి కాంటాక్ట్ లిస్టు, ఫ్లైట్ లాగ్ సమాచారాన్ని అధికారులు బయట పెట్టారు. మొత్తం 200 పేజీలు కల్గిన ఈ జాబితాలో ప్రముఖల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మైక్ జాగర్, మైఖేల్ జాక్సన్, అలెబ్ బాల్డ్ విన్, ఆండ్రూ క్యూమో, నవోమి క్యాంప్‌బెల్, కోర్ల్నీ, కెన్నడీ జూనియర్ తల్లి ఎథెల్ కెన్నడీ, కెర్రీ, టెడ్, ఇవానా ట్రంప్, ఇవాంక ట్రంప్, పేర్లు కూడా ఉన్నాయి. అయితే వీరంతా ఎప్‌స్టీన్ కస్టమర్లు కావాని.. కేవలం కాంటాక్ట్ లిస్టులోని జాబితా మాత్రమేనని తెలిపారు. కానీ తాజాగా ఈయనకు ట్రంప్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తుండగా.. ఈకేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.