|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 05:33 PM
దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. చాపకింద నీరులా ప్రవహిస్తూ.. అమాయక ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లోనే 498 కొత్త కేసులు నమోదు కాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం కేసుల సంఖ్య 5,364కు చేరుకోగా.. మృతుల సంఖ్య 55కు చేరుకుంది. ఎప్పటిలాగే కేరళనే ఎక్కువ కేసులతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలు స్థానం దక్కించుకున్నాయి.
కేంద్ర వైదారోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 6వ తేదీ ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 5,364కు చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదు కాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు కేరళకు చెందిన వాళ్లు కావడం గమనార్హం. ఎప్పటిలాకే కేరళలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం కేరళలోని పాజిటివ్ కేసుల సంఖ్య 1679కి చేరుకోగా.. గుజరాత్‌లో 615, పశ్చిమ బెంగాల్‌లో 596, ఢిల్లీలో 592, మహారాష్ట్రలో 548, కర్ణాటకలో 451, తమిళనాడులో 221, ఉత్తర ప్రదేశ్‌లో 205, రాజస్థాన్ 107, హర్యానాలో 78 కేసులు ఉన్నాయి.
ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్ర ప్రదేశ్ 62, బిహార్ 37, మధ్య ప్రదేశ్ 36, ఛత్తీస్‌గఢ్ 24, ఒడిశాలో 23, పంజాబ్ 21, పుదుచ్చేరి 12, సిక్కిం 12, అస్సాం 10, గోవాలో 8, ఝార్ఖండ్ 8, జమ్మూ కాశ్మీర్ 7, తెలంగాణ 5, ఉత్తరాఖండ్ 3, ఛండీగఢ్ 2, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
ప్రస్తుతం సీజనల్ వ్యాధులు పెరుగుతున్న తరుణంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు మాస్క్‌లు ధరించడం, హ్యాండ్ సానిటైజర్ వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వివరిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సహా అవసరమైన వైద్య సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.
Latest News