|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 05:32 PM
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి.. దేశం మొత్తం మాత్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కాశ్మీర్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానవత్వానికి, పర్యాటకానికి, కాశ్మీరీల జీవనోపాధికి పాకిస్తాన్ వ్యతిరేకమని ఆరోపించారు. అందుకే పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మరోసారి పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన మోదీ.. పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు.. పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు ఇవ్వడాన్ని కూడా మోదీ తీవ్రంగా ఖండించారు.
గత కొన్నేళ్లుగా కాశ్మీర్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ వెల్లడించారు. అక్కడ పర్యాటకం కూడా భారీగా పెరిగిందని తెలిపారు. దీంతో కాశ్మీర్ ప్రజలకు జీవనోపాధి దక్కడంతో వారి పరిస్థితి మారుతోందని వివరించారు. అయితే అది చూసి తట్టుకోలేని పాకిస్తాన్.. పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేసిందని మండిపడ్డారు. పాకిస్తాన్ పర్యాటకానికి, మానవత్వానికి, కాశ్మీర్ ప్రజల రోజీ-రోటీ (జీవనోపాధి)కి వ్యతిరేకమని ఈ సందర్భంగా ప్రధానమంత్రి తెలిపారు. ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషించి.. భారత్‌పైకి ఉసిగొల్పుతున్న విధానాన్ని ప్రపంచ దేశాలు మొత్తం చూశాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
అయితే కాశ్మీర్ గడ్డపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు.. ఆ దేశాన్ని మరింత ఒత్తిడిలో పడేశాయి. ఇప్పటికే ఉగ్రవాదులకు తమ గడ్డపై శిక్షణ ఇస్తున్న పాక్.. వారిని భారత్‌లో దాడులు చేసేందుకు పంపుతోందనే వాదనలకు ప్రధాని మోదీ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ కచ్చితమైన క్రూయిజ్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే తమ పోరాటం పాకిస్తాన్ ప్రజలపై కాదని.. కేవలం ఉగ్రవాదులకు వ్యతిరేకంగానే అని భారత్ స్పష్టం చేసింది.