|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 01:44 PM
విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పెద్దిపాలెంలో భారీగా అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. గ్రామంలోని శ్రీ బాలాజీ మోడరన్ రైస్ మిల్లులో 200 టన్నుల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు అనుమానంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.
భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్ నేతృత్వంలో రెవెన్యూ శాఖ అధికారులు మిల్లులో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పీడీఎస్‌కు చెందిన రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్టు నిర్ధారించడంతో మొత్తం 200 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా వాణిజ్య ప్రయోజనాల కోసం నిల్వ చేయడంపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.