|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 09:06 PM
గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు విచారించారు. కస్టడీ గడువు పూర్తి కావడంతో, ఆయనను నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టి, అక్కడి నుంచి విజయవాడ సబ్ జైలుకు తరలించారు.ఈ రెండు రోజుల విచారణలో భాగంగా, నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంపై పోలీసులు వంశీని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. సుమారు 30కి పైగా ప్రశ్నలతో ఈ వ్యవహారంలో ఆయన పాత్రపై ఆరా తీసినట్లు సమాచారం. ముఖ్యంగా, ఈ నకిలీ పట్టాలను ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది వంటి అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో కూడా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నకిలీ పట్టాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.మరోవైపు, వంశీ అస్వస్థతకు గురికావడంతో విచారణకు కొంత ఆటంకం కలిగిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అనుకున్నంత స్థాయిలో విచారణ జరపలేకపోయినట్లు చెబుతున్నారు.మరోవైపు, కస్టడీ అనంతరం వంశీని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయన భార్య పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన సీప్యాప్ పరికరం సహాయంతో మాత్రమే శ్వాస తీసుకోగలుగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు అందుతున్న వైద్యం పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా లేదు" అని ఆమె తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ వంటి ఆసుపత్రికి తరలించి వైద్యం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరినట్లు పంకజశ్రీ చెప్పారు. వంశీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన 105 కేజీల నుంచి 85 కేజీలకు బరువు తగ్గిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News