|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 07:51 PM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి భారత్ మరింత అప్రమత్తమైంది. దాయాది దేశానికి దౌత్య పరంగా చుక్కలు చూపిస్తూనే.. ఆపరేషన్ సిందూర్‌తో గుణపాఠం నేర్పింది. ఇది మాత్రమే కాకుండా.. సరిహద్దులు దాటి ఏ ఒక్క పాక్ పౌరుడు, ఉగ్రవాది రాకుండా గట్టి చర్యలు చేపడుతుంది. సైన్యానికి తెలియకుండా సరిహద్దులు దాటి చీమ కూడా కాలు పెట్టకుండా చేస్తోంది. ఈక్రమంలోనే ఓ పాకిస్థానీ చొరబాటుకు యత్నించగా.. విషయం గుర్తించిన భారత సైన్యం అక్కడికక్కడే అతడిని మట్టుబెట్టింది. ఉద్దేశ పూర్వకంగానే వస్తున్నట్లు గుర్తించి కాల్పులు జరిపింది.
శుక్రవారం రోజు అర్ధరాత్రి గుజరాత్‌లోని బనస్కాంత్ జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాలు ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయి. ముఖ్యంగా సరిహద్దును దాటిన ఓ పాకిస్థాన్ పౌరుడు.. కంచె దాటి వస్తున్నట్లు బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. అయితే అతడిని నిలువరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అతడు మాత్రమే ఉద్దేశ పూర్వకంగానే ముందుకు సాగాడు. సైనికులు ఎంతి చెప్పినా పట్టించుకోకుండా పరుపరుగునా వచ్చాడు. దీంతో ఇక చేసేదేమీ లేక బీఎస్ఎఫ్ సిబ్బంది.. కాల్పులు జరిపింది. ఈక్రమంలోనే అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇది మాత్రమే కాకుండా మే 7వ తేదీ బుధవారం రోజు అర్ధరాత్రి సమయంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. చిమ్మ చీకట్లో ఉద్దేశ పూర్వకంగానే అతడు సరిహద్దులు దాటబోతుండగా.. భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్లు అతడిని గుర్తించారు. కావాలనే వస్తుండడంతో అప్రమత్తమై అతడిపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో పాకిస్థానీ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బీఎస్ఎఫ్ బలగాలు అతడి మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు అతడి వద్ద ఏమైనా ఉన్నాయోమోనని తనిఖీలు చేయగా.. పాకిస్థాన్‌లో తయారు అయిన వ్యవసాయ రసాయనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పహల్గాం దాడి తర్వాత నుంచి భారత్ చాలా గట్టి చర్యలు చేపడుతోంది. ఎవరినీ సరిహద్దురు దాటి రానీయకుండా రాత్రి, పగలనే తేడా లేకుండా గస్తీ కాస్తోంది.