![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:59 PM
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సైనిక దాడులు, ప్రతిదాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయని లండన్‌లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ వాల్టర్ లాడ్విగ్ అన్నారు. రెండు అణ్వస్త్ర దేశాలు ఇలా వరుసగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను శిక్షించడమే భారత్ లక్ష్యమని, పాకిస్థాన్‌తో పెద్ద యుద్ధానికి దిగడం కాదని ఆయన స్పష్టం చేశారు. 'ఆపరేషన్ సిందూర్ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డిటరెన్స్' పేరిట భద్రతా వ్యవహారాల అధ్యయన సంస్థ 'రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్' కోసం రాసిన విశ్లేషణలో లాడ్విగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత వైమానిక దళం గత దశాబ్ద కాలంగా పెంపొందించుకున్న సామర్థ్యాలు స్పష్టంగా కనిపించాయన్నారు. "అణుశక్తి కలిగిన రెండు దేశాలు ఈ విధంగా పరస్పరం వైమానిక దాడులు చేసుకోవడం అణుయుగంలో మనకు ఇంతకుముందు కనిపించని పరిణామం" అని ఆయన తెలిపారు.2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావిస్తూ, ఆ సంఘటన ఒక కీలక మలుపు అని, అది చాలా వ్యూహాత్మకంగా జరిగిందని అన్నారు. "1960ల చివర్లో రష్యా, చైనాలు భూభాగంపై పోరాడాయి. అప్పుడు కూడా ఉద్రిక్తతలు పెరగకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, ఇది పూర్తిగా కొత్త పరిస్థితి. రాబోయే దశాబ్దాల్లో దీనిపై విస్తృత అధ్యయనం జరుగుతుంది" అని లాడ్విగ్ అభిప్రాయపడ్డారు.
Latest News