|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:55 PM
గుజరాత్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని బీఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్చి చంపారు. బనస్కాంత జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన కంచెను దాటుకుని ఒక వ్యక్తి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు అతడిని ఆగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అయినప్పటికీ, ఆ వ్యక్తి హెచ్చరికలను ఖాతరు చేయకుండా ముందుకు రావడానికి ప్రయత్నించాడు. దీంతో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా భద్రతా సిబ్బంది అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో సదరు పాకిస్థాన్ జాతీయుడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఎస్‌ఎఫ్ దళాలు నిరంతర నిఘాతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాజా ఘటనతో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పటిష్టం చేశారు.
Latest News