|
|
by Suryaa Desk | Thu, May 22, 2025, 08:35 PM
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రశంసించారు. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదానికి శిక్ష తప్పదని, ఉగ్రమూకలు ఎక్కడ నక్కినా ఏరివేస్తామనే బలమైన సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో పాటు యావత్ ప్రపంచానికి ఇచ్చారని ఆయన అన్నారు.ఇప్పటి భారతదేశం ఎంతో భిన్నమైనదని, పూర్తి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గోవా రాజ్‌భవన్‌లోని వామన్ వృక్షకళా ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ప్రాచీన భారతీయ వైద్య నిపుణులు చరకుడు, సుశ్రుతుడుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.దేశం గర్వపడేలా చేసిన మన సాయుధ బలగాలకు తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత సైనిక దళాలు చూపిన ప్రతిభ అమోఘమని కొనియాడారు. శత్రువుల స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసి, నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన మన సైన్యం సత్తాను ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయని వివరించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన శక్తిసామర్థ్యాలను మరోసారి నిరూపించుకుందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
Latest News