![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 03:35 PM
ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఏళ్లకు ఏళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. అయితే వీరిద్దరి యుద్ధంలో గాజాలోని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారుల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఓవైపు ఆకలి కేకలు.. మరోవైపు ఆర్తనాదాల మధ్య గాజా ప్రాంతం అట్టుడికిపోతోంది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య చర్చలు పలు దఫాలుగా జరుగుతున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ కు చెందిన నేత మోషే ఫైగ్లిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి చిన్నారి మాకు శత్రువు అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోషే ఫైగ్లిన్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. "మా శత్రుత్వం హమాస్ తో కాదు. హమాస్ వద్ద ఉన్న మిలిటరీ కాదు. గాజాలోని ప్రతి బిడ్డ.. ప్రతి చిన్నారి మా శత్రువు. వీలైనంత త్వరగా గాజాను స్వాధీనం చేసుకోవాలి. అక్కడ ఇజ్రాయెల్ జెండా ఎగరాలి. గాజాలోని ఒక్క శిశువు కూడా జీవించడానికి వీలు లేదు. ఇదే విజయం" అని మోషే ఫైగ్లిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారులపై ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. అంతకుముందు.. ఇజ్రాయెల్ లోని ది డెమోక్రాట్స్ పార్టీ అధినేత, ఐడీఎఫ్ మాజీ డిప్యూటీ చీఫ్ యెయిర్ గోలాన్ ఇజ్రాయెల్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారులను చంపడం నెతన్యాహూ ప్రభుత్వం హాబీగా మార్చుకుందని దుయ్యబట్టారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మోషే ఫైగ్లిన్ ఈ విధంగా స్పందించారు. మరోవైపు గోలాన్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయోద్దని సూచించారు. ఐడీఎఫ్ ఆర్మీ దేశం కోసం పోరాటం చేస్తోందని.. ప్రపంచంలోనే ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆర్మీ అని నెతన్యాహూ అన్నారు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అక్కడి ప్రజలకు అండగా ఉండాలని.. ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపు నిచ్చారు.
Latest News