![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 09:01 AM
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్యతో ఓ మైనర్ బాలుడు అసభ్యకర రీతిలో కనిపించాడన్న ఆగ్రహంతో, ఇంటి యజమాని అతడిని గ్యాస్ సిలిండర్‌తో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ఢిల్లీలోని గులాబీ నగర్ ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ముఖేష్ ఠాకూర్ (25)ను ఘటనా స్థలంలోనే అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మృతుడు జతిన్ (17) పది రోజుల క్రితమే పని వెతుక్కుంటూ ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది.పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, మే 19-20వ తేదీల మధ్య రాత్రి సమయంలో నిందితుడు ముఖేష్ ఠాకూర్, మృతుడు జతిన్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత, జతిన్ తన భార్య సుధతో అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా ముఖేష్ చూశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా బంతియా తెలిపారు. మరుసటి రోజు ఉదయం, సుధ రోషనారాలోని ఓ బొమ్మల ఫ్యాక్టరీకి పనికి వెళ్లిన తర్వాత, ముఖేష్‌కు, జతిన్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ముఖేష్, ఇంట్లోని చిన్న గ్యాస్ సిలిండర్‌ను తీసుకుని జతిన్ తలపై పలుమార్లు బలంగా కొట్టడంతో, అతను అక్కడికక్కడే మృతి చెందాడని డీసీపీ వివరించారు.మృతుడు జతిన్, ముఖేష్ భార్య సుధకు తెలిసిన వ్యక్తి ద్వారా వారి ఇంట్లో అద్దెకు దిగినట్లు పోలీసులు తెలిపారు.ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో, ముఖేష్ ఇంటి బయట మురుగు కాల్వలో రక్తం ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు అనుమానంతో తలుపు తట్టారు. మొదట ఎవరూ స్పందించలేదు. కొంత సమయం తర్వాత ముఖేష్ తలుపు తీయగా, లోపల జతిన్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వారు షాక్‌కు గురయ్యారు. ముఖేష్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, చుట్టుపక్కల వారు అతడిని గదిలోనే బంధించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 10:53 గంటల ప్రాంతంలో పీసీఆర్ కాల్ అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని, అదే గదిలో ఉన్న మరో వ్యక్తిని గుర్తించినట్లు డీసీపీ రాజా బంతియా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Latest News