|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 05:08 PM
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా సుముఖత చూపకపోతే, ఆ దేశంపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించాల్సి వస్తుందని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. సెనెట్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు రష్యాను హెచ్చరించారు.కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో రష్యా కొన్ని నిర్దిష్ట నిబంధనలను ప్రతిపాదిస్తోందని, ఆ నిబంధనలు ఏమిటో స్పష్టత వచ్చిన తర్వాతే యుద్ధం ముగింపుపై రష్యా వైఖరి పూర్తిగా అర్థమవుతుందని రూబియో పేర్కొన్నారు. ప్రస్తుత శాంతి చర్చలు ఫలవంతమవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే, చర్చలు జరుగుతున్న సమయంలో ఆంక్షల ప్రస్తావన తీసుకురావడం దౌత్యపరమైన ప్రక్రియకు ఆటంకం కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ శాంతి స్థాపనకు రష్యా ఇష్టపడకపోయినా, యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నా కఠిన చర్యలు తప్పవని ఆయన తేల్చిచెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారని రూబియో తెలిపారు.
Latest News