|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:33 PM
ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో మ్యాజిక్ జరుగుతోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోందన్నారు. ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో.. పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 47 మంది విద్యార్థులను మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సన్మానించారు. ప్రముఖులు రచించిన తొమ్మిది రకాల పుస్తకాలను వారికి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులున్నా తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలి. అనేక సవాళ్లు ఉన్నా విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం. నేడు మీరు సాధించిన విజయంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఏపీ విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రభుత్వ ఫలితాలపై పేపర్లలో ప్రకటనలు జారీచేస్తాం. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే కఠినమైన లక్ష్యాలనే ఎంచుకోవాలి. జీవితంలో అనేక పరీక్షలుంటాయి. పరీక్షలను సవాలుగా తీసుకునేవారే విజేతలుగా నిలుస్తారు. జూన్ నెలాఖరుకు విద్యా సంస్కరణలు పూర్తిచేస్తాం’’ అని మంత్రి అన్నారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ... విద్య ద్వారా మాత్రమే సమాజంలో కఠిమైన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
Latest News