|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 06:28 PM
'ఆపరేషన్ సిందూర్' విజయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి వారిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాకిస్థాన్ యాత్రకు పంపాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. బెంగళూరులోని బ్యాటరాయనపుర అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. "ఆపరేషన్ సిందూర్‌లో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న వాదనను శంకిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాకిస్థాన్ వెళ్లి స్వయంగా తెలుసుకోవాలి. కనీసం ఏడాది పాటు వారిని అక్కడే ఉంచాలి" అని ఆమె అన్నారు. పాకిస్థాన్‌పై దాడుల విషయంలో కేంద్రానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధమైన ప్రకటనలు చేయడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Latest News