|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:38 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్‌సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్‌లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీని నాశనం చేయాలని, వైయస్ జగన్ నాయకత్వంను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైయస్ఆర్‌సీపీ పై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైయస్ జగన్‌ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాధించుకున్నారు. తప్పుడు ఆరోపణలతో వైయస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్‌లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం అని అన్నారు.
Latest News