|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:11 PM
ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. దీనిపై విధివిధానాలను విద్యాశాఖ ఖరారు చేసింది. టీచర్లకు ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్ల కేటాయింపుపై కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కచ్చితంగా బదిలీ కావాల్సిన హెచ్‌ఎంలు, టీచర్ల కటాఫ్ తేదీలను కూడా నిర్ధేశించింది. ఒకే పాఠశాలలో 2020 ఆగస్టు 31 నుంచి పనిచేస్తున్న హెచ్‌ఎంలు, 2017 ఆగస్టు 31 ముందు నుంచి పనిచేస్తున్న ఇతర టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. ఉమ్మడి జిల్లాలో సుమారు 10,850 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసినవారు సుమారు 1200మంది ఉన్నారు. సరిపడా విద్యార్థులు లేక రేషన్‌లైజేషన్ (హేతుబద్ధీకరణ) కు గురైనవారు మరో 1800 వరకు ఉన్నారు. మొత్తంగా 3వేల మంది వరకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. ఈ ఏడాది రెండేళ్లు సర్వీసు చేసిన వారికి బదిలీకి అవకాశం ఇచ్చారు. ఉపాధ్యాయులకు ప్రాధాన్యత, బదిలీలలో మార్గదర్శకాలను జారీ చేశారు. పాఠశాలలు పునర్వివస్థీకరణ నేపథ్యంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు జిల్లాలో 249 మంది ఎస్‌ఏలను హెచ్‌ఎంలుగా కన్వర్షన్ చేశారు. ప్రాథమిక పాఠశాలలు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, 1-10 తరగతి ఉన్న ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయగా, ఇంకా 14 మంది ఎస్జీటీలు సర్‌ప్లస్‌గా ఉన్నారు. ముందుగా హెచ్‌ఎంలను బదిలీ చేస్తారు. తర్వాత అర్హులైన ఎస్‌ఏలకు హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించి వారికి స్థానాలను కేటాయిస్తారు. అనంతరం ఏస్‌ఏలు, ఎస్జీటీల బదిలీలు చేపడతారు. వెబ్‌లో దరఖాస్తు కూడా ముందుగా హెచ్‌ఎంలకు, తర్వాత స్థానాల్లో ఎస్‌ఏలు, ఎస్జీటీలకు అవకాశం ఇవ్వనున్నారు. దరఖాస్తుల పరిశీలనకు జిల్లాకేంద్రంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ బదిలీలపై సంఘాలు కొన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అనంతరం మార్పులు, చేర్పులతో బదిలీలపై షెడ్యూల్‌ను శనివారం లేదంటే సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది.
Latest News