|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 10:45 AM
ఏపీలో లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమని అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్‌లోనే చాలా స్పష్టంగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రిటైర్డ్ ప్రభుత్వాధికారులు కృష్ణమెహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల బెయిల్ పిటీషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌లో ప్రస్తావించిన అంశాలను చూస్తే ఈ విషయం తెట్టతెల్లమవుతోందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్ళిన చంద్రబాబు దానికి ప్రతిగా కక్షతోనే ఈ తప్పుడు కేసును సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు కేసులతో వైయస్ జగన్‌ను భయపెట్టాలని అనుకోవడం వారి అవివేకమని అన్నారు. ఈ లిక్కర్ కేసులో వైయస్ జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి ఎక్కడైనా సంతకాలు చేశారా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలని ఫైళ్లలో సిఫారస్ చేశారా? వారు ఇలా చేశారని ఏ ఒక్క అధికారి అయినా ఫిర్యాదు చేశారా? అపట్లో పనిచేసిన ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీనీ సిట్ పేరుతో ఏర్పాటు చేసిన అధికారుల బృందం ఎలా విచారణ పేరుతో వేధించిందో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వంలో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చిన అధికారికి ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన పిటీషన్‌ను అడ్డం పెట్టుకుని ఈ కథ ప్రారంభించారు. తనకు ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. వారు తొమ్మిది రోజుల్లో విచారణ జరిపి సదరు అధికారికి నివేదికను సమర్పించారు. ఈ నివేదికపై విచారణ జరపాలని ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు.
దీనిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పుడు సీఐడీకి నేతృత్వం వహిస్తున్న వినీత్ బిజ్రాల్ ఈ మొత్తం కేసును పూర్తిగా పరిశీలించి, ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, ఈ కేసును ముందుకు తీసుకువెళ్ళలేనని తెగేసి చెప్పారు. దీనిపై కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే పోలీస్ ఉన్నతాధికారి, సదరు సీఐడీ చీఫ్ వినీత్ బిజ్రాల్‌ను బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడని వినీత్ బిజ్రాల్ తప్పు చేయడానికి నిరాకరించడంతో పాటు తన రాజీనామాను సైతం సదరు అధికారి ముఖాన కొట్టారు. మళ్లీ సదరు పోలీస్ ఉన్నతాధికారి వినీత్ బిజ్రాల్‌ను బతిమిలాడి, ఆయనను ఆ స్థానం నుంచి పక్కకు తప్పించి, ఆయన స్థానంలో తాము చెప్పినట్లు వినే పోలీస్ అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. వైయస్ జగన్ ను లక్ష్యంగా పెట్టుకుని ఈ కేసును నడిపిస్తున్నారు అని అన్నారు.
Latest News