![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 07:20 PM
1971 నాటి యుద్ధంలో భారత సైన్యం అద్భుత విజయం సాధించినప్పటికీ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చర్చల వేదికపై ఆ విజయాన్ని చేజార్చుకున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూపడాన్ని, 1971 యుద్ధ విజయాన్ని ఇందిరా గాంధీ ఘనతగా ప్రచారం చేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది.నేడు బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు రాధా మోహన్ దాస్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "1971-72లో రెండు యుద్ధాలు జరిగాయి. ఒకటి డిసెంబర్ 3న భారత సైన్యం చేసింది. రెండోది 1972 జూలై 2న సిమ్లాలో చర్చల రూపంలో జరిగింది. పాకిస్థాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోతో జరిగిన రాజకీయ చర్చల్లో ఇందిరా గాంధీ భారత్‌కు అనుకూలంగా ఏమీ సాధించలేకపోయారు" అని అగర్వాల్ విమర్శించారు.ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్‌షా లేకపోతే 1971 యుద్ధంలో ఓడిపోయేవారమని అగర్వాల్ అన్నారు. "ఇందిరా గాంధీ ముందే యుద్ధానికి వెళ్లాలని భావించారు. కానీ, తొందరపడితే ఘోర పరాజయం తప్పదని మానెక్‌షా స్పష్టం చేశారు. సైన్యం నిబంధనల ప్రకారమే యుద్ధం జరగాలని, లేకపోతే తాను రాజీనామా చేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. దీంతో ఇందిర ఆయన సలహా పాటించాల్సి వచ్చింది" అని వివరించారు.సైన్యం యుద్ధభూమిలో అద్భుత విజయం సాధిస్తే, ఇందిరా గాంధీ దాన్ని చర్చల బల్లపై చేజార్చారని అగర్వాల్ ఆరోపించారు. "లొంగిపోయిన 93,000 మంది పాకిస్థానీ సైనికులను ఐదు నెలల పాటు మన దేశంలో అల్లుళ్లలా చూసుకున్నాం. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పాకిస్థాన్ నుంచి మనం ఏమీ పొందలేకపోయాం. పశ్చిమ పాకిస్థాన్‌లో మనం స్వాధీనం చేసుకున్న 15,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి ఇచ్చేశాం. సుమారు ఐదు కోట్ల మంది బంగ్లాదేశీ వలసదారులను వెనక్కి పంపించలేకపోయాం. వారు ఇప్పటికీ పశ్చిమ బెంగాల్‌కు సమస్యగా ఉన్నారు. 93,000 మంది పాక్ సైనికులను మనం తిరిగి పంపినా, పాకిస్థాన్ చెరలో ఉన్న మన 56 మంది సైనికులను మాత్రం వెనక్కి తీసుకురాలేకపోయాం. 1971లో సైన్యం సాధించిన దాన్ని, ఇందిరా గాంధీ మరుసటి ఏడాది పోగొట్టుకున్నారు" అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Latest News