తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన , మంచి అభిరుచిగల నిర్మాతగా అల్లు అరవింద్ గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించి, వారి హృదయాలలో చెరగని ముద్రవేశారు.
నిర్మాతగా, స్టూడియో అధినేతగా, ఆహా ఫౌండర్ గా ప్రేక్షకుల చేత విశేష ప్రశంసలనందుకుంటున్న అల్లు అరవింద్ గారు ఈ రోజు 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు, సంస్థలు, ప్రేక్షకాభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నాయి.
అల్లు అరవింద్ నిర్మించిన చిత్రాలలో ఎక్కువశాతం ప్రేక్షకుల మెప్పును పొంది సూపర్ హిట్ అయినవే ఎక్కువ ఉండడం విశేషం. నిర్మాతగా 'బంట్రోతు భార్య' తో మొదలైన ఆయన సినీరంగ ప్రయాణం, రీసెంట్గా విడుదలైన '18 పేజెస్' మూవీ వరకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఇంకా మరెన్నో మంచి, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆయన శ్రీకారం చుట్టాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రేక్షక దేవుళ్ళు కోరుకుంటున్నారు.