తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాతల్లో ఒకరిగా పేరుగాంచిన ఎం. అర్జునరాజు (87) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రోజా మూవీస్ పతాకంపై కె. శివరామరాజుతో కలిసి అర్జునరాజు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ హీరోగా ఆయన నిర్మించిన 'వేటగాడు', 'కొండవీటి సింహం' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. అప్పట్లో ఎన్టీఆర్, శ్రీదేవిల అభిమాన నిర్మాతగా అర్జునరాజుకు పేరుండేది. శ్రీదేవి కాల్‌షీట్లు కావాలంటే చాలామంది ఆయన్నే సంప్రదించేవారని చెబుతారు.ఎన్టీఆర్‌తో పాటు కృష్ణ, కృష్ణంరాజులతో 'అడవి సింహాలు', శోభన్‌బాబుతో 'కోడెత్రాచు', చిరంజీవితో 'జేబుదొంగ', నాగార్జునతో 'బావనచ్చాడు' వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'మా నాన్నకు పెళ్లి' చిత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకున్న తొలి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ జితేంద్ర, ధర్మేంద్ర వంటి స్టార్లతో ఆరు చిత్రాలు నిర్మించి అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు.అర్జునరాజు అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa