సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దివంగత తమిళ నటుడు ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్రప్రసాద్ అన్నారు.ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటేనని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు మాట్లాడలేదని, అనుకోకుండా ఆ వ్యాఖ్యలు దొర్లాయని అన్నారు. అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెబుతూ ఆయన వీడియో విడుదల చేశారు.తమిళ సినిమా ప్రేక్షకుల వలె నేను కూడా ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తానని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. కాంతారావును ప్రశంసించే క్రమంలో అనుకోకుండా నోరు జారానని అంగీకరించారు. అనుకోకుండా జరిగిన ఈ అంశాన్ని కొందరు పెద్దది చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తాను చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న సమయంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. తాము నటిస్తుంటే ఆయన వచ్చి చూసేవారని, అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడగలనా అని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa