☼ Suryaa News
🔴 క్రీడలు ఆసియా క్రీడల్లో భారత్ బోణీ
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ బోణీ

20 Sep 2026 vasu

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం
నగోయా:ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో భారతదేశం పతకాల ఖాతా తెరిచింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటింగ్ బృందం రజత పతకాన్ని సాధించింది. ఎలవెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదర్శ వినోద్‌లతో కూడిన భారత త్రయం సంయుక్తంగా 1898 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, జపాన్ నాలుగో స్థానానికి పరిమితమైంది.

వ్యక్తిగత విభాగంలోనూ భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఎలవెనిల్ వలరివన్ 633.5 పాయింట్లతో అగ్రశ్రేణి ప్రతిభ చాటి వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించగా, సోనమ్ మాస్కర్ కూడా ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ విజయంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం దక్కడంతో పాటు షూటింగ్‌లో పతకాల బోణీ కొట్టింది.

మరోవైపు, మహిళల సాంప్రదాయ 60 కేజీల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలోనూ భారత్‌కు మరో పతకం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్ పోరులో మంగోలియాకు చెందిన అల్తాంచిమెగ్ బైగల్మాను ఓడించి భారత ఫైటర్ సుచికా తరియల్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో రౌండ్‌లో మంగోలియన్ అథ్లెట్ తీవ్ర దూకుడు ప్రదర్శించినప్పటికీ, సుచికా పటిష్టమైన రక్షణతో ఎదుర్కొని, సమయస్ఫూర్తితో ప్రత్యర్థిని నేలకూల్చి విజయాన్ని ముద్దాడింది. సెమీస్‌లోకి ప్రవేశించడంతో సుచికా భారత్‌కు కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసింది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home