10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో హిమాంశుకు రజతం, రుద్రాంకష్‌కు కాంస్యం
ఐచి-నగోయా:ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటారు. సోమవారం హోరాహోరీగా జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ పోరులో హిమాంశు ధిల్లాన్ రజత పతకం సాధించగా, రుద్రాంకష్ పాటిల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒకే విభాగంలో ఇద్దరు భారత షూటర్లు పతకాలు సాధించడంతో భారత్‌కు డబుల్ పోడియం దక్కింది. చైనాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ షెంగ్ లిహావో 254.2 పాయింట్ల గేమ్స్ రికార్డుతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్నాడు.
ఎనిమిది మంది పాల్గొన్న ఈ ఫైనల్ పోటీలో ఆరంభం నుండి భారత షూటర్లు అద్భుత ప్రతిభను కనబరిచారు. తొలి 10 షాట్ల ముగిసేసరికి రుద్రాంకష్ 106.0 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, హిమాంశు కూడా వరుసగా 10.9తో సహా ఉత్తమ స్కోర్లు సాధిస్తూ పోటీలో నిలిచాడు. ఎలిమినేషన్ రౌండ్లు సాగుతున్న కొద్దీ తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. చైనా షూటర్ షెంగ్ క్రమంగా పాయింట్ల అంతరాన్ని తగ్గించుకుంటూ ముందుకు వచ్చాడు.
మంగోలియా షూటర్ నిష్క్రమణతో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఆ తర్వాత జరిగిన చివరి రౌండ్లలో హిమాంశు 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకోగా, రుద్రాంకష్ 230.9 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో మెరిశాడు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ బృందం తమ ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది.