☼ Suryaa News
🔴 క్రీడలు చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్..క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన శ్రీకాంత్
క్రీడలు

చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్..క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన శ్రీకాంత్

03 Sep 2026 vasu

తన్వి, ధృవ్-తనిషాలకు నిరాశ
షెన్‌జెన్ (చైనా): చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోరులో శ్రీకాంత్ ప్రపంచ 9వ ర్యాంకర్, కెనడా ఆటగాడు విక్టర్ లైపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.

గతంలో ప్రపంచ నంబర్ 1గా నిలిచిన శ్రీకాంత్, రెండుసార్లు BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల కాంస్య పతక విజేత అయిన లైపై 21-18, 21-19 తేడాతో వరుస గేమ్లలో ఘనవిజయం సాధించాడు. ఈ సీజన్‌లో యూఎస్ ఓపెన్ తర్వాత శ్రీకాంత్ క్వార్టర్స్‌కు చేరడం ఇది రెండోసారి. తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ చి యు-జెన్‌ను ఓడించిన శ్రీకాంత్, నేడు ప్రపంచ 9వ ర్యాంకర్ లైని మట్టికరిపించాడు. క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్ ఆటగాడు లీ చెుక్ యియుతో శ్రీకాంత్ తలపడనున్నాడు.

మహిళల సింగిల్స్‌లో యంగ్ సెన్సేషన్ తన్వి శర్మ 17-21, 21-18, 16-21 తేడాతో జపాన్‌కు చెందిన టోమోకా మియాజాకి చేతిలో తీవ్రంగా పోరాడి ఓడిపోయింది. అంతకుముందు దేవిక సిహాగ్ ఓడిపోవడంతో మహిళల సింగిల్స్‌లో భారత నిష్క్రమణ పూర్తయింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ధృవ్ కపిల - తనిషా క్రాస్టో జోడీ లియు కువాంగ్ హెంగ్ - హ్సు యిన్-హుయ్ (చైనీస్ తైపీ) చేతిలో, అలాగే రోహన్ కపూర్ - రుత్విక శివాని జోడీ కూడా తమ మ్యాచ్‌లలో ఓటమిపాలై టోర్నమెంట్ నుంచి వెనుతిరిగారు.

ప్రపంచ 5వ ర్యాంకర్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి జోడీ తమ తొలి రౌండ్‌లో మలేషియా జంటపై గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన పోపోవ్ సోదరులతో వీరు తలపడనున్నారు. భారత్ తరఫున సింగిల్స్‌లో శ్రీకాంత్ ఒక్కడే పతక రేసులో నిలవడంతో తదుపరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home