☼ Suryaa News
🔴 జాతీయం బఖిరా సరస్సు అవక్షేపాల అధ్యయనం
జాతీయం

బఖిరా సరస్సు అవక్షేపాల అధ్యయనం

10 Sep 2026 vasu

రుతుపవనాల అంచనా, నీటి నిర్వహణపై కీలక ఆధారాలు
సంతకబీర్ నగర్ (ఉత్తర ప్రదేశ్): భారతీయ వేసవి రుతుపవనాల్లో గత 25,000 సంవత్సరాలుగా సంభవించిన మార్పులకు సంబంధించిన సుదీర్ఘ ఆధారాలను ఉత్తర ప్రదేశ్‌లోని బఖిరా సరస్సు అవక్షేపాలు బయటపెట్టాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST) పరిధిలోని 'బీర్బల్ సాహ్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్' (BSIP) శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన ద్వారా భవిష్యత్ రుతుపవనాల ధోరణిని అంచనా వేయడంతో పాటు, మధ్య గంగా మైదానంలో నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేసేందుకు మార్గం సుగమమైంది.

శాస్త్రవేత్తలు నజాకత్ అలీ, సాజిద్ అలీ, బిస్వజీత్ ఠాకూర్, అనుపమ్ శర్మల బృందం సరస్సు అడుగున పేరుకుపోయిన పర్యావరణ అయస్కాంత లక్షణాలు, రేణువుల పరిమాణం మరియు భూరసాయన రికార్డులను పరిశీలించి ఈ అధ్యయనం రూపొందించారు. రామ్‌సర్ సైట్‌గా గుర్తింపు పొందిన ఈ సరస్సులోని అవక్షేప క్రమాన్ని ఏడు యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ (AMS) రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా ధృవీకరించారు. చివరి హిమయుగం గరిష్ట స్థాయి (చల్లని, పొడి పరిస్థితులు) నుంచి బోలింగ్-అలెరోడ్ కాలం (వెచ్చని, బలమైన రుతుపవనాలు), యంగర్ డ్రయాస్ మరియు హోలోసీన్ శీతోష్ణస్థితి గరిష్ట దశల వరకు సంభవించిన వాతావరణ పరిణామాలను ఈ అధ్యయనం వివరంగా నమోదు చేసింది.

ప్రసిద్ధ అంతర్జాతీయ పరిశోధనా పత్రిక 'పాలియోజియోగ్రఫీ, పాలియోక్లైమటాలజీ, పాలియోఎకాలజీ'లో ప్రచురితమైన ఈ అధ్యయనం, వాతావరణ నమూనాలను మరింత ఖచ్చితంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడనుంది. మానవ ప్రేరిత మార్పులను, ప్రకృతిసిద్ధంగా జరిగే శీతోష్ణస్థితి మార్పుల నుంచి వేరు చేసి అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని పరిశోధకులు తెలిపారు. వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడే గంగా మైదాన ప్రాంతంలో నీటి యాజమాన్యం, వ్యవసాయ ప్రణాళికలు, వరద-కరువు నివారణ చర్యలకు ఈ ఫలితాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home