ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు కీలక హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా మరియు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నియమించారు. భారత రాజ్యాంగం కల్పించిన అధికారాల మేరకు, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)తో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఢిల్లీ, జమ్మూ-కశ్మీర్ మరియు లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు ఈ నియామకాలు జరిగాయి.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులు కాగా.. సంజయ్ శర్మ, భరత్ పరాశర్, డాక్టర్ అదితి చౌదరి, దినేష్ భట్, అరుణ్ భరద్వాజ్‌లు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జమ్మూ-కశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు న్యాయమూర్తిగా యశ్ పాల్ బోర్నీ నియమితులయ్యారు.
అలాగే జార్ఖండ్ హైకోర్టుకు మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు న్యాయమూర్తులుగా ఎంపికయ్యారు. కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ఉషారాణి, కె.ఎస్. భరత్ కుమార్, నెరలే వి. భవానిలు నియమితులయ్యారు. ఈ నియామకాలతో ఆయా హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ అయి, కేసుల విచారణ మరింత వేగవంతం కానుంది.