☼ Suryaa News
🔴 జాతీయం ముంబైలో ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా కన్నుమూత
జాతీయం

ముంబైలో ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా కన్నుమూత

20 Sep 2026 vasu

ప్రధాని మోదీ, ఇతర నాయకుల సంతాపం
ముంబై:సీఎన్ఎన్-న్యూస్18 (CNN-News18) అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా (46) ఆదివారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. శనివారం రాత్రి పొద్దుపోయాక తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స అందించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు సహోద్యోగులు వెల్లడించారు.

పాయల్ మెహతా ఆకస్మిక మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెను ఒక అత్యంత ప్రతిభావంతురాలైన, శ్రమకోర్చే జర్నలిస్ట్‌గా ప్రధాని కొనియాడారు. క్షేత్రస్థాయి పరిశీలన, జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో ఆమె రిపోర్టింగ్ సాగేదని గుర్తుచేసుకున్నారు. ఆమె వ్యక్తిత్వంలోని ఆప్యాయత, దయ ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ, మెహతా కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాయల్ మెహతా మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలను తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఎంతో నిబద్ధత, వృత్తి నైపుణ్యంతో కవర్ చేసేవారని కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ, ప్రజా వ్యవహారాలపై విశేష అవగాహన ఉన్న కష్టపడే పాత్రికేయురాలిని మీడియా రంగం కోల్పోయిందని అన్నారు. ఆమె అకాల మరణం పట్ల పలువురు ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు తీవ్ర సంతాపం ప్రకటించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home