ఒడిశా పర్యాటకుల మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి
అగర్ మాల్వా: మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లా నల్ఖేడా వద్ద ఉన్న మా బగ్లాముఖి ఆలయం సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒడిశాకు చెందిన ఏడుగురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మహాకాళేశ్వర్ దర్శనం కోసం ఆధ్యాత్మిక యాత్రగా మధ్యప్రదేశ్ వెళ్లిన బనమాలి బెహెరా కుటుంబంతో సహా మొత్తం ఏడుగురు ఈ ప్రమాదంలో కన్నుమూయడంతో వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ విచారం వ్యక్తం చేశారు. మృతదేహాలను ఆదివారం నాటికి ఒడిశాకు రప్పించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు సీఎం తెలిపారు.
మరోవైపు, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.