పెట్టుబడుల పేరుతో అమాయకులనులు నిలువునా ముంచేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీని ఆసరాగా చేసుకుని క్వాంటమ్ ఏఐ (Quantum AI) ప్లాట్‌ఫామ్‌లలో ఇన్వెస్ట్ చేస్తే కంటి మీద కునుకులేకుండా భారీ రిటర్న్స్ వస్తాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారు. రూ.20 వేల నుంచి రూ.22 వేలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా ఏకంగా రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించినట్లుగా కొన్ని నకిలీ వీడియోలు, పోస్టులు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఈ తరహా ఆన్‌లైన్ మోసాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ 'పీఐబీ ఫ్యాక్ట్ చెక్' (PIB Fact Check) తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎటువంటి క్వాంటమ్ ఏఐ పెట్టుబడి పథకాలను ప్రకటించలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆ పోస్టులన్నీ పూర్తిగా అబద్ధమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా సైబర్ కేటుగాళ్లు సృష్టించిన ఫేక్ కంటెంట్ అని తేల్చిచెప్పింది.
ఇటువంటి నకిలీ వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింకులు, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, ఆన్‌లైన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డు పిన్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేసింది. ఒకవేళ సైబర్ మోసాల బారిన పడితే వెంటనే స్థానిక పోలీసులను లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను ఆశ్రయించాలని సూచించింది.