భారతీయ రైల్వే ఆమోదం
ముంబై:రైలు రవాణా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రయాణీకుల, సరుకు రవాణా కార్యకలాపాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని చౌక్-కర్జత్ రైల్వే సెక్షన్ డబ్లింగ్‌కు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని 10.86 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని సుమారు ₹497 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన గొడుగు ప్రాజెక్టుల (Umbrella Projects) కింద దీనికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
పన్వెల్-చౌక్-కర్జత్ కారిడార్‌లో కీలక భాగమైన ఈ సెక్షన్ ప్రస్తుతం సింగిల్-లైన్‌గా ఉంది. డబ్లింగ్ పనులు పూర్తయితే ప్రతిరోజూ ప్రతి దిశలో అదనంగా ఐదు ప్యాసింజర్ రైళ్లను నడపడానికి వీలవుతుంది. అలాగే సరుకు రవాణా రైళ్ల ఆలస్యం తగ్గడమే కాకుండా, సంవత్సరానికి 18.35 మిలియన్ టన్నుల (MTPA) అదనపు సరుకు రవాణాకు ఈ మార్గం ఉపయోగపడనుంది. కీలక మార్గాల్లో రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ముందడుగు.