కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని న్యూఢిల్లీలోని చారిత్రాత్మక పురానా ఖిల్లాలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 'సేవా సంకల్ప అభియాన్' కింద 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సాంప్రదాయబద్ధంగా 'ఆశీర్వాద దీపం' వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి షెకావత్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రజా జీవితం సంపూర్ణంగా దేశ శ్రేయస్సుకు, ప్రజా సేవకే అంకితమైందని కొనియాడారు. ఈ 'ఆశీర్వాద దీపం' ప్రజల సేవ, కృతజ్ఞత మరియు 'వికసిత్ భారత్' నిర్మాణ సామూహిక సంకల్పానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. 2014 నుండి దేశంలో ఫలితాల ఆధారిత సుపరిపాలన సాగుతోందని, ప్రభుత్వ పథకాల వాస్తవ ప్రయోజనాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరడమే ఉత్తమ పాలనకు కొలమానమని ఆయన అభిప్రాయపడ్డారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ “వికాస్ భీ, విరాసత్ భీ” అనే మార్గదర్శక సూత్రంతో ముందుకు సాగుతోందని, దేశ శాస్త్రీయ, జానపద సంప్రదాయాలను పరిరక్షించి భావి తరాలకు అందించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు. ఈ వేడుకల్లో సంగీత నాటక అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, కథక్ కేంద్రం మరియు లలిత్ కళా అకాడమీ కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమృత కాలంలో దేశ నిర్మాణం, సాంస్కృతిక పరిరక్షణ మరియు 'వికసిత్ భారత్ 2047' లక్ష్యానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటిస్తూ సామూహిక దీపోత్సవంతో కార్యక్రమం ముగిసింది.