సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఒక భారీ ప్రీమియం సినిమా ప్రాపర్టీని తీసుకురానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం జర్మనీలోని ట్రామ్‌పాలస్ట్ లియోన్‌బర్గ్‌లో ఉన్న స్క్రీన్ 127 అడుగుల వెడల్పు, 69 అడుగుల ఎత్తుతో గిన్నిస్ రికార్డు కలిగి ఉండగా, అమెరికాలోని జార్జియాలో మరో భారీ స్క్రీన్ ఉంది. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ అధిగమించేలా హైదరాబాద్‌లో సరికొత్త స్క్రీన్‌ను నిర్మించేందుకు ఈ టీమ్ ప్రణాళికలు రచిస్తోంది.
హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రీమియం సినిమా అనుభవాల కోసం భారీ స్క్రీన్ల నిర్మాణం ఊపందుకుంది. కోకాపేట్‌లోని అల్లు సినిమాస్‌లో 75 అడుగుల వెడల్పైన స్క్రీన్‌ను భారత్‌లోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా చెబుతున్నారు. అయితే చిరంజీవి–ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో రానున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన కచ్చితమైన కొలతలు, సీటింగ్ సామర్థ్యం, అత్యాధునిక టెక్నాలజీ వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గనుక పూర్తయితే, హైదరాబాద్ పేరు కేవలం భారతీయ సినిమా రంగంలోనే కాకుండా ప్రపంచ సినిమా ఎగ్జిబిషన్ మ్యాప్‌లోనూ మరోసారి ప్రముఖంగా నిలవనుంది.