ముంబై:అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో పాటు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో గురువారం దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో లభించిన లాభాలను చివర్లో వదులుకుని 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 21.86 పాయింట్లు పడిపోయి 74,314.59 వద్ద స్థిరపడగా, 50 షేర్ల ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్పంగా 53 పాయింట్లు పెరిగి 23,270.60 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ కంపెనీలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టైటాన్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్ మరియు యాక్సిస్ బ్యాంక్ నష్టపోగా.. టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మారుతి మరియు ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. ఫెడ్ నిర్ణయంతో పాటు యూఎస్ 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) రూ. 2,032.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్లపై ప్రభావం చూపాయి.
మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కి చెందిన భారీ రూ. 22,569 కోట్ల ఐపీఓ గురువారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభం కాగా, మొదటి రోజే 39 శాతం మేర సబ్‌స్క్రయిబ్ అయ్యి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 1.61 శాతం తగ్గి బ్యారెల్‌కు 104.1 డాలర్లకు చేరింది. ఆసియా మార్కెట్లలో నిక్కీ లాభపడగా.. కోస్పీ, షాంఘై, హాంగ్ సెంగ్ సూచీలు నష్టాలతో ముగిశాయి.