చిన్న జీయర్ స్వామిని కలిసిన మంత్రి తుమ్మల ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆలయ భూమి పూజ ఈ నెల 12న; 20 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణం

Select Suryaa Now
ఖమ్మం/హైదరాబాద్, సూర్య ప్రతినిధి: ఖమ్మం నగరంలోని అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈ నెల 12న భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భక్తుల చిరకాల కోరిక నెరవేరే దిశగా ఈ కార్యక్రమం ముందడుగు వేయనుందని ఆయన పేర్కొన్నారు. భూమి పూజ ఏర్పాట్లలో భాగంగా మంత్రి తుమ్మల శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు, భూమి పూజ కార్యక్రమ నిర్వహణ, ఆగమ శాస్త్ర పద్ధతులు వంటి అంశాలపై స్వామీజీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.