నా లక్ష్యం రేవంత్ రెడ్డి మాత్రమే, పార్టీ కాదు! :కొండా సుష్మిత

Select Suryaa Now

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన నిర్ణయాలను నేరుగా ప్రశ్నిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తాను విమర్శిస్తున్నది కేవలం రేవంత్ రెడ్డి విధానాలను మాత్రమేనని సుష్మిత స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ... అందుకే తాను వారిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికి ఎక్కడిదని ఆమె సూటిగా ప్రశ్నించారు. పరకాల నియోజకవర్గంలో మళ్లీ స్థానిక ఎమ్మెల్యేనే గెలిపించాలని సీఎం పిలుపునివ్వడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు.

పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిగానైనా పరకాల స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సుష్మిత ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిపై సొంత మంత్రి కుమార్తె ఈ స్థాయిలో విమర్శలు చేయడం, స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది.