సనత్‌నగర్ టిమ్స్‌లో శుక్రవారం నుంచి ఐపీ సేవలు ప్రారంభం!
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిలో ఆగస్టు 21 (శుక్రవారం) నుంచి ఇన్‌పేషెంట్ (IP) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రారంభోత్సవ సమయంలో సందర్శకులు అధిక సంఖ్యలో ఆపరేషన్ థియేటర్లు, వార్డుల్లోకి రావడంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఏర్పడింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రి యాజమాన్యం క్రిమిసంహారక (ఫ్యూమిగేషన్) ప్రక్రియను చేపట్టింది. గురువారంతో మొదటి దశ పూర్తికానుండటంతో శుక్రవారం నుంచి ఐపీ సేవలను మొదలుపెడుతున్నారు. తదుపరి దశల్లో మిగిలిన ఫ్యూమిగేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారించుకున్న అనంతరం (సుమారు 2-3 వారాల్లో) శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) కూడా ప్రారంభించనున్నారు.
మరోవైపు ఆసుపత్రిలో ఔట్ పేషంట్ (OP) సేవలకు రోగుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ట్రయల్ రన్ సమయంలో రోజుకు 200 మంది రాగా, బుధవారం నాటికి ఆ సంఖ్య 700 దాటింది. ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు. మధ్యాహ్నం 2:00 గంటల వరకు రోగులను పరిశీలించి వైద్యం అందిస్తున్నారు.
