దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తి

Select Suryaa Now

తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా సాగిన విచారణ పూర్తయింది. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను ఆలకించిన అనంతరం తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో సెప్టెంబర్ 16వ తేదీన తీర్పు వెలువరించనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

బిఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ తరపు సీనియర్ న్యాయవాదులు కె.వివేక్ రెడ్డి, గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. పార్టీ మారడమే కాకుండా, కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారని.. ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నప్పటికీ స్పీకర్ ఈ అనర్హత పిటిషన్‌ను కొట్టివేయడం రాజ్యాంగ విరుద్ధమని వివరించారు.

కాగా, ఎమ్మెల్యేల తరపున హాజరైన న్యాయవాదులు ఈ వాదనలను తోసిపుచ్చారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల సుదీర్ఘ వాదనలను నమోదు చేసుకున్న హైకోర్టు ధర్మాసనం, తుది తీర్పును సెప్టెంబర్ 16కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.