తుంగతుర్తి కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు
ఎమ్మెల్యే మందుల సామేల్‌పై అధిష్టానానికి ఫిర్యాదు
తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహార శైలిపై నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను పక్కనబెట్టి, ఇతరులకు ప్రాధాన్యత ఇస్తూ పదవులు కట్టబెడుతున్నారంటూ స్థానిక నాయకులు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌ను కలసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
జగ్గారెడ్డి నివేదికతో వేడెక్కిన రాజకీయం
ఇటీవల నియోజకవర్గంలో తలెత్తిన విభేదాలు, పార్టీ పరిస్థితిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యయనం చేసి అధిష్టానానికి ఒక నివేదిక సమర్పించారు. ముఖ్యంగా మండల అధ్యక్షుల నియామకం విషయంలో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారని జగ్గారెడ్డితో పాటు స్థానిక నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ సీనియర్లను సంప్రదించకుండానే నియామకాలు చేపట్టడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ మళ్లీ అధిష్టానం వద్దకు చేరడంతో తుంగతుర్తి కాంగ్రెస్ రాజకీయం కాకరేపుతోంది.