సమ్మెకు వెళ్లొద్దు ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం

Select Suryaa Now

చర్చలతో సమస్యలు పరిష్కరించుకుందాం
సంక్షేమ బోర్డు ఏర్పాటు.. ఎలక్ట్రిక్ ఆటోలకు రూ.1.50 లక్షల సాయం
ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ
మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సమ్మె మార్గం కాదని, చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హుస్నాబాద్ నుంచి ఆటో కార్మిక సోదరులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వంతో చర్చలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2015 తర్వాత ఆటో చార్జీలను పెంచలేదని మంత్రి పేర్కొన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేసి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. దీనికి అవసరమైన విధివిధానాలను రూపొందించి త్వరలో బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో కార్మికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. రెట్రోఫిట్మెంట్ కోసం ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ సహాయం అందించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసేవారికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ఆటో కార్మికుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని వారికి మరింత ప్రయోజనం కల్పించే విధానంపై ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. అర్హులైన ఆటో కార్మికుల కుటుంబాలకు రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించిన విధంగానే ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నందున ఆటో కార్మికులు సమ్మెను విరమించి సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.