ట్రాన్స్‌జెండర్ వేషంలో వచ్చి మహిళపై లైంగిక దాడి: నిందితుడి అరెస్ట్
హిజ్రా వేషధారణలో ఓ వ్యక్తి ఇంటికి వచ్చి ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘోర ఘటన ముంబైలోని పోవై ప్రాంతంలో వెలుగుచూసింది. ఈ నెల 19న ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ శేషారావు షిండే (28) అనే వ్యక్తి చీర ధరించి, తాను ట్రాన్స్‌జెండర్‌నంటూ పోవైలోని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. అనారోగ్య సమస్యలకు దిష్టి తీస్తానని, సంతానం లేని వారికి పూజలు నిర్వహిస్తానని నమ్మబలికాడు. లోపలికి ప్రవేశించిన తర్వాత మహిళను పడక గదిలోకి తీసుకెళ్లి, పూజ నెపంతో భయపెట్టి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడున్న నగదుతో అక్కడి నుండి పరారయ్యాడు.
బాధితురాలి ఇచ్చిన సమాచారంతో పోవై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు 100కు పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, నిందితుడు ఆటోలో థానే పరిధిలోని కల్వా ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు. ఆగస్టు 20న తెల్లవారుజామున అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు ట్రాన్స్‌జెండర్ కాదని, పురుషుడని తేలింది. నిందితుడికి గతంలోనూ ఇటువంటి నేర చరిత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
