వివాదాస్పద పోస్ట్ వల్ల ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై సస్పెన్షన్ వేటు.. అసలు ఏం జరిగిందంటే!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అంతర్జాతీయంగా ఎంతో పేరుగాంచిన రియాలిటీ డాన్స్ షో డాన్సింగ్ విత్ ది స్టార్స్ వేదికపై ఒక వివాదాస్పద ఘటన కలకలం రేపింది. ఈ షోలో సుదీర్ఘకాలంగా ప్రొఫెషనల్ డాన్సర్‌గా కొనసాగుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ వాల్ చ్మెర్కోవ్‌స్కీపై నిర్వహకులు వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఒక వివాదాస్పద పోస్ట్ ఈ చర్యకు దారితీసింది. ఆ పోస్ట్ షో యొక్క విలువలకు మరియు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో నిర్మాతలు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ వివాదం వెనుక ఉన్న వివరాల్లోకి వెళితే, డాన్సింగ్ విత్ ది స్టార్స్ షోలోని జడ్జిలలో ఒకరైన క్యారీ ఆన్ ఇనాబా, వాల్ చ్మెర్కోవ్‌స్కీ భార్య అయిన జెన్నా జాన్సన్ ప్రదర్శనను తీవ్రంగా విమర్శించారు. ఆమె వేసిన ఒక డాన్స్ స్టెప్‌పై జడ్జి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన వాల్ చ్మెర్కోవ్‌స్కీ, విల్ స్మిత్ ఆస్కార్ అవార్డుల వేదికపై జరిపిన దాడి ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో ఒక వ్యాఖ్యను పోస్ట్ చేశారు. ఇది కాస్తా తీవ్ర దుమారానికి దారితీసింది.
ఈ వ్యవహారంపై షో నిర్వాహకులైన బీబీసీ స్టూడియోస్ వెంటనే స్పందించింది. తాము తమ కార్యక్రమంలో పనిచేసే వారి భద్రత మరియు గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. షో ప్రమాణాలకు భంగం కలిగించినందుకు గానూ ఆయనను వచ్చే వారం జరిగే ఎపిసోడ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వివాదం ముదరడంతో వాల్ చ్మెర్కోవ్‌స్కీ ఆ పోస్ట్‌ను తొలగించి, జడ్జి క్యారీ ఆన్ ఇనాబాతో పాటు ప్రేక్షకులకు, అభిమానులకు ఇన్స్టాగ్రామ్ ద్వారా బహిరంగ క్షమాపణలు తెలియజేశారు.
Also Read: 'రామయణం' కోసం సాయిపల్లవి శాకాహారిగా మారారంటూ వస్తున్న వార్తలపై నటి స్పందన!